వినోద రంగంలో రికార్డు డీల్: వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినోద ప్రపంచంలోనే అతిపెద్ద చరిత్ర సృష్టిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మెగా డీల్ విలువ ఏకంగా 82.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.43 లక్షల కోట్లు) కావడం విశేషం. వినోద పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ కొనుగోలుగా నిలవనున్న ఈ ఒప్పందం 2026 మూడో త్రైమాసికంలో అధికారికంగా ఖరారు కానుంది.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు కంటెంట్ లైబ్రరీ పరంగా భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ ఒప్పందంతో హెచ్‌బీఓ నెట్‌వర్క్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత సిరీస్‌లు, సినిమాల హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఇందులో ముఖ్యంగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘ది లాస్ట్ ఆఫ్ అస్’, ‘సక్సెషన్’ వంటి అగ్రశ్రేణి సిరీస్‌లు; అలాగే ‘హ్యారీ పాటర్’, ‘ఫ్రెండ్స్’ వంటి క్లాసిక్ సినిమాలు, సిరీస్‌లు, డీసీ కామిక్స్ కలెక్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో చేరనున్నాయి. ఇది నెట్‌ఫ్లిక్స్ చందాదారులకు వినోదాన్ని రెట్టింపు చేయనుంది.

ఈ కొనుగోలు తర్వాత కూడా సినిమాలను థియేటర్లలో విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. అయితే, థియేటర్ల నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే సమయం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, హెచ్‌బీఓ కంటెంట్‌ను తమ సబ్‌స్క్రయిబర్లకు కాంప్లిమెంటరీ ఆఫర్‌గా ఇచ్చే ఆలోచనతో పాటు, రెండు లైబ్రరీలను కలిపి కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టవచ్చని కూడా నెట్‌ఫ్లిక్స్ సూచనప్రాయంగా తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు