నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు: “సరదాకేమో అనుకున్నా, పతకాలు సాధించడం గ్రేట్!”

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి సినిమాల్లోనే కాకుండా, పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌-2025లో ఆమె ఏకంగా నాలుగు పతకాలను సాధించారు. ఇందులో ఓవరాల్‌గా సిల్వర్ మెడల్, డెడ్ లిఫ్ట్‌లో గోల్డ్ మెడల్, బెంచ్ మరియు స్క్వాట్ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. ప్రగతి సాధించిన ఈ అరుదైన విజయంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ఎమ్మెల్సీ నాగబాబు సైతం ప్రగతిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో, ప్రగతి గతంలో చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేయడం చూసి, “ఇదేంటి చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేస్తోంది, సరదాకేమో” అని మొదట్లో అనుకున్నానని తెలిపారు. కానీ ఆమె ఇంత నిబద్ధతగా ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. నటనతో పాటు క్రీడారంగంలో అంతర్జాతీయస్థాయిలో రాణించడం అరుదైన విషయం, ఇది చాలా మంది మహిళలకు స్ఫూర్తిదాయకం అని నాగబాబు కొనియాడారు.

కాగా, నటి ప్రగతి తనపై వచ్చిన ట్రోలింగ్‌పై కూడా స్పందించారు. తాను పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ట్రోల్స్ వచ్చాయని, ఈ వయసులో ఇదంతా అవసరమా అంటూ చాలామంది చేసిన కామెంట్స్ బాధించాయని ఆమె తెలిపారు. తాను సినిమాలను మానేయకుండానే, నటిస్తూనే లిఫ్టింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనను ట్రోల్ చేసినవారికి పతకాలతోనే సమాధానం చెప్పానని, ఈ పతకాలను మహిళా ఆర్టిస్టులకు అంకితం ఇస్తున్నట్లు ప్రగతి ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు