తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తన రాజకీయ భవిష్యత్తు, బీఆర్ఎస్ అవినీతి, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా, “నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను” అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు.
తాను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానో కవిత స్పష్టం చేశారు. దేవుడి దయతో సీఎం అయితే.. 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్ని అన్యాయాలు, తప్పిదాలు, అవినీతి వ్యవహారాలపై తప్పకుండా విచారణ చేయిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు చూస్తున్నది తాను వేసిన ‘టాస్’ మాత్రమేనని.. వారి అవినీతి, అక్రమాలపై అసలు ‘టెస్ట్ మ్యాచ్’ త్వరలో ఉండబోతోందని కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయొద్దని.. తమ పాలనలో తాను, తన భర్త ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని ఆమె స్పష్టం చేశారు.
కవిత ఈ సందర్భంగా ఉస్మాన్ కుంట చెరువు ఆక్రమణపై ప్రధానంగా దృష్టి సారించారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్ కు డెవలప్మెంట్ కోసం ఇచ్చారని.. అందులో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్గా ఉన్నారని ఆరోపించారు. 10 ఎకరాల చెరువు 6 ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాను దృష్టి పెట్టాలని కోరారు. అంతేకాకుండా, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నానని.. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని ఆమె చట్టపరమైన హెచ్చరికలు జారీ చేశారు.









