హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ విగ్రహావిష్కరణ చుట్టూ కొంత వివాదం నెలకొన్నప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించిన 7.2 అడుగుల ఎస్పీ బాలు కాంస్య విగ్రహాన్ని రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రతిష్టించారు. విగ్రహావిష్కరణ అనంతరం, ఈ సాయంత్రం రవీంద్రభారతి వేదికపై ఎస్పీ బాలు జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.
ఈ సంగీత కార్యక్రమంలో 50 మంది కళాకారులు పాల్గొని బాలు స్వరాలను మరోసారి వేదికపై వినిపించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ ద్వారా తెలుగు రాష్ట్రాల కళాభిమానులు ఎస్పీ బాలును స్మరించుకున్నారు.









