ఐబొమ్మ రవికి మరో 12 రోజుల పోలీసు కస్టడీ పొడిగింపు….

పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవికి నాంపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు మరోసారి పోలీసు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, మరో మూడు కేసుల్లో ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు రవిని కస్టడీకి విచారించేందుకు అనుమతించింది. ఈ నెల 18వ తేదీ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని తిరిగి తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ వాదనలు వినిపిస్తూ, కస్టడీ పేరుతో రవిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇప్పటికే రెండుసార్లు విచారణ పూర్తయిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, రవిని మరోసారి కస్టడీకి తీసుకుని విచారణ జరిపితేనే ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌కు సంబంధించిన పూర్తి నెట్‌వర్క్, ఇతర కార్యకలాపాలు బయటపడతాయని సైబర్ క్రైమ్ పోలీసులు తమ వాదనను బలంగా వినిపించారు.

పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు, పైరసీ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు ఈ కస్టడీ అవసరమని భావించి అనుమతిని ఇచ్చింది. ఈ పొడిగింపుతో, ఐబొమ్మ పైరసీ వెనుక ఉన్న పూర్తిస్థాయి సిండికేట్ వివరాలు, ఆర్థిక లావాదేవీలు మరియు అంతర్జాతీయ లింకులను తెలుసుకునేందుకు పోలీసులకు మరింత సమయం లభించినట్లయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు