దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2’ చిత్రం ఇటీవల విడుదలకు ముందు ఎదురైన సమస్యలపై స్పందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిసెంబరు 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడగా, బాలకృష్ణ సలహాలు, సూచనలతోనే ఆ సమస్యలను అధిగమించి డిసెంబరు 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగామని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. కష్ట సమయంలో బాలయ్య అండగా నిలబడటంతోనే విడుదల సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
సినిమా వాయిదా పడినప్పుడు తాను టెన్షన్ పడకపోయినా, అడ్వాన్స్ టికెట్లు కొని ఎదురుచూస్తున్న అభిమానుల గురించి మాత్రం తీవ్రంగా ఆందోళన చెందానని బోయపాటి తెలిపారు. షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు రద్దు చేస్తే, అభిమానుల కోపం, నిరాశను నియంత్రించడం కష్టమని తాము అర్థం చేసుకున్నామని అన్నారు. అందుకే థియేటర్ల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నామని, ఆ తర్వాత బాలకృష్ణతో చర్చించి, ఆయన మార్గదర్శకాలను పాటిస్తూ చిత్రాన్ని విడుదల చేశామని వివరించారు.
‘అఖండ 2’ సినిమాకు శివుడి సెంటిమెంట్ అడ్డు వచ్చిందా అన్న ప్రశ్నకు బోయపాటి స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం శివుడి సినిమా కాదని, శివ భక్తుడి కథ అని ఆయన బదులిచ్చారు. ఈ చిత్రం డబ్బు సంపాదించడానికి లేదా సందేశాన్ని ఇవ్వడానికి తీసింది కాదని, కమర్షియల్ హంగులతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి మాత్రమే రూపొందించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు.









