టెక్నాలజీని దుర్వినియోగం చేయకండి: AI ఫేక్ ఫోటోలపై నటి శ్రీలీల భావోద్వేగ విజ్ఞప్తి!

ఇటీవల సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో నటీమణుల అసభ్యకర చిత్రాలను సృష్టిస్తున్న ధోరణిపై టాలీవుడ్ యువ నటి శ్రీలీల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను జీవితాలను సులభతరం చేసేందుకు వాడాలే తప్ప, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి నిరాధారమైన, ఫేక్ కంటెంట్‌ను ఎవరూ ప్రోత్సహించవద్దని చేతులు జోడించి తన అభిమానులకు, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

శ్రీలీల బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన మరియు భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. “చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఎవరో ఒకరికి కూతురు, సోదరి లేదా స్నేహితురాలు అని గుర్తుంచుకోవాలి. మేము సురక్షితమైన వాతావరణంలో పనిచేస్తున్నామనే భరోసా మాకు ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. పని ఒత్తిడి వల్ల ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ దారుణాలు మొదట తన దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు చెప్పడంతో తెలిసి తీవ్రంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య కేవలం తనది మాత్రమే కాదని, తోటి నటీమణులు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని, అందరి తరఫున తాను గళం విప్పుతున్నానని శ్రీలీల స్పష్టం చేశారు. ఫేక్ కంటెంట్‌ను సృష్టించే వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్మిక మందన్న, ఆలియా భట్ వంటి తారలు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ (Deepfake) బాధితులుగా మారి తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు