తెలంగాణలో ఈ ఏడాది క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 24 లేదా 25 నుండి ప్రారంభం కానున్నాయి. గతంలో వారం నుంచి పది రోజుల పాటు ఇచ్చే ఈ సెలవులను ప్రస్తుతం తగ్గిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా సాధారణ సెలవు ఉంటుంది. అలాగే, మరుసటి రోజు డిసెంబర్ 26న ‘బాక్సింగ్ డే’ (Boxing Day) సందర్భంగా కూడా సెలవు ప్రకటించడంతో, విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉంది.
సాధారణ పాఠశాలలకు కనీసం రెండు రోజుల సెలవులు (డిసెంబర్ 25, 26) ఖచ్చితంగా ఉండగా, క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థలకు మాత్రం సుమారు 5 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 28 (ఆదివారం) వరకు ఈ పాఠశాలలు మూతపడవచ్చు. డిసెంబర్ 27 శనివారం నాడు కొన్ని స్కూళ్లు పని చేస్తాయి, మరికొన్ని హాఫ్ డే ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ సెలవులపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
పాఠశాలల్లో సెలవులు ప్రారంభం కావడానికి ముందే ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA-III) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు డిసెంబర్ 23 నాటికి ముగియనున్నాయి. పరీక్షలు పూర్తి కాగానే విద్యార్థులు క్రిస్మస్ పండుగ వేడుకల్లో నిమగ్నం కావచ్చు. ఇక తదుపరి విడత పరీక్షలు (FA-IV) ఫిబ్రవరి 2026లో జరగనున్నాయి.









