తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బుధవారం జరిగిన సభలో కేసీఆర్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న రాజకీయ వేధింపులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనపై ఏకంగా 181 కేసులు పెట్టించారని, అక్రమంగా జైలుకు పంపి తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనను అణచివేసేందుకు కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
తాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్‌పై పగ సాధింపు చర్యలకు దిగడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఆయన చేసిన పాపాలకు ప్రకృతియే శిక్ష వేస్తుందని నేను వదిలేశాను. అందుకే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన కాలు జారి పడి నడుము విరగ్గొట్టుకున్నారు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రస్తుతం తన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌నే ఒక బందీఖానాగా మార్చుకున్నారని, శారీరక ఇబ్బందులు మరియు రాజకీయ ఒంటరితనం వల్ల ఆయన బయటకు రాలేకపోతున్నారని, అది ఆయనకు ప్రకృతి ఇచ్చిన శిక్ష అని రేవంత్ అభివర్ణించారు.
కేసీఆర్‌ను జైలుకు పంపాలన్న డిమాండ్లపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేసీఆర్‌ను జైలులో పెడితే ప్రభుత్వానికే ఖర్చు పెరుగుతుందని, ఆయనకు భోజనం, వసతి కల్పించడం కంటే ఫామ్ హౌస్‌లో ఉండటమే మంచిదని వ్యాఖ్యానించారు. “ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నది నా పోలీసులే.. ఇంతకంటే పెద్ద జైలు ఆయనకు ఏముంటుంది?” అని ప్రశ్నించారు. చుట్టూ తన ప్రభుత్వం పహారా కాస్తుండగా, బయటకు రాలేని స్థితిలో ఉండటమే కేసీఆర్‌కు అసలైన శిక్ష అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.









