ఇటీవల తెలంగాణ పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి విచారణలో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. కేవలం ఓటీటీ సినిమాలను వెబ్సైట్లో పెట్టడమే కాకుండా, రవి ఏకంగా క్యూబ్ (Qube) నెట్వర్క్ శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. థియేటర్లలో ప్రదర్శితమయ్యే సినిమాలను హెచ్డీ క్వాలిటీతో తస్కరించి, తన టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా విదేశాల్లో ఉన్న వారికి విక్రయించేవాడు. ఇటీవల విడుదలైన ‘హిట్ 3’, ‘తండేల్’, ‘కిష్కింధపురి’ వంటి చిత్రాలను కూడా ఇదే తరహాలో పైరసీ చేసి భారీగా దండుకున్నట్లు విచారణలో తేలింది.
రవి కేవలం సినిమాలను ఉచితంగా అందించడమే కాకుండా, టెలిగ్రామ్ వేదికగా ‘పే పర్ వాచ్’ (Pay-per-watch) విధానాన్ని నడిపేవాడు. ఒక్కో సినిమాకు 100 నుండి 300 డాలర్ల వరకు వసూలు చేస్తూ ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్‌లో ఉన్న సినీ ప్రియులను టార్గెట్ చేసేవాడు. దీనికి తోడు ఐబొమ్మ వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా కూడా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు సమాచారం. హ్యాకింగ్ విద్యలో ఆరితేరిన రవి, శాటిలైట్ లింక్స్‌ను హ్యాక్ చేయడం వంటి సాహసోపేతమైన సైబర్ నేరాలకు పాల్పడటం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకున్న రవి, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో విదేశాల్లో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సినిమా పరిశ్రమకు కోట్లలో నష్టం చేకూర్చిన రవి నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని సాక్ష్యాల కోసం రవి వినియోగించిన సర్వర్లు, బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ ముగిసే సమయానికి మరిన్ని దిగ్భ్రాంతికరమైన హ్యాకింగ్ మూలాలు బయటపడే అవకాశం ఉంది.









