దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రంపై అంచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయి. తెలుగు మార్కెట్ దాటి మహేష్‌కు పెద్దగా పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినప్పటికీ, రాజమౌళి ఆయనతో ఈ ‘పాన్ వరల్డ్’ సాహసానికి పూనుకోవడం విశేషం. సుమారు 1100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద 3000 కోట్లకు పైగా వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాజమౌళి సరికొత్త ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ భారీ చిత్ర ప్రమోషన్ల కోసం ఇండస్ట్రీలోని అగ్ర హీరోలంతా కలిసి రావడానికి ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ఇండస్ట్రీలో అందరు హీరోలతో మంచి సంబంధాలు ఉండటం, రాజమౌళి విజన్ పట్ల ఉన్న గౌరవంతో ఈ అరుదైన కలయిక సాధ్యం కానుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. 2027 సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు రాజమౌళి పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు.
తారాగణం విషయంలోనూ రాజమౌళి రాజీ పడకుండా భారీ స్టార్లను ఎంచుకున్నారు. మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి రూపొందించే ఈ దృశ్యకావ్యం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.









