ఎన్టీఆర్ ఆశయ సాధనే మా నివాళి: నారా భువనేశ్వరి ఉద్వేగపూరిత ప్రసంగం

దివంగత నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగించడమే ఆయనకు తాము ఇచ్చే నిజమైన నివాళి అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన బాటలోనే ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

ట్రస్ట్ ద్వారా అందిస్తున్న బహుముఖ సేవల గురించి భువనేశ్వరి ఈ సందర్భంగా వివరించారు. పేద మరియు అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందించడమే కాకుండా, సివిల్స్ అకాడెమీ ద్వారా యువతను ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆరోగ్య రంగంలో తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్కుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని, ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, ‘ఎన్టీఆర్ సుజల’ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఆమె తెలిపారు.

ఈ వేడుకలో ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినాప్సిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న హరికృష్ణ, ఎంటర్ ప్రెన్యూయర్ గా రాణిస్తున్న ఉమ శ్రీ వంటి వారు తమ కెరీర్ రూపొందడంలో ఈ సంస్థల పాత్రను గుర్తుచేసుకుని చంద్రబాబు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నామని, విద్యార్థులు బాహ్య ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు