చంద్రబాబు కోసమే పాలమూరు ప్రాజెక్టును ఆపారు: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘పాత బాస్’ అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును మెప్పించేందుకే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాజెక్టు పూర్తయితే మాజీ సీఎం కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న భయంతోనే రేవంత్ రెడ్డి పనులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం 45 టీఎంసీల కేటాయింపులకు అంగీకరించడం రాష్ట్రానికి తీరని నష్టమని ఆయన హెచ్చరించారు.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఆర్థిక లబ్ధి పొందేందుకు మర్చంట్ బ్యాంకర్ల సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందిస్తూ.. నిఘా వ్యవస్థలు ఎప్పటి నుంచో ఉన్నాయని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలరా అని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు, సిట్‌ల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఇచ్చిన నిజమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. కేవలం రెండేళ్లలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు