నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ విషయంలో మహిళల స్వేచ్ఛకు మద్దతుగా నిలుస్తున్న సింగర్ చిన్మయిపై శివాజీ మద్దతుదారులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె గతంలో పాడిన ‘కిలిమంజారో’ వంటి పాటల్లోని అర్థాలను ప్రస్తావిస్తూ, ఆమెకు నైతిక హక్కు లేదని శేఖర్ బాషా వంటి వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా, చిన్మయి తాను పాడిన అదే ‘కిలిమంజారో’ పాటను పాడుతూ వ్యంగ్యంగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “బయట అందరూ కొట్టుకుంటుంటే.. నువ్వు హ్యాపీగా పాటలు పాడుకుంటున్నావా?” అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, చిన్మయి స్పందిస్తూ.. “ఎవడి చావు వాడు చస్తాడు.. నాకేంది” అని రిప్లై ఇచ్చారు. ఈ షాకింగ్ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వివాదం ద్వారా డ్రెస్సింగ్ స్వేచ్ఛపై చర్చ మరోసారి తారస్థాయికి చేరింది. ఒకవైపు శివాజీ మాటలను సమర్థిస్తూ సంప్రదాయాల గురించి కొందరు మాట్లాడుతుంటే, మరొకవైపు వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించే హక్కు ఎవరికీ లేదని చిన్మయి, అనసూయ వంటి వారు వాదిస్తున్నారు. విమర్శలను తనదైన శైలిలో ఎదుర్కొంటున్న చిన్మయి తీరుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.









