ద్రాక్షారామం ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి, ఆలయ సిబ్బందికి మధ్య గత కొంతకాలంగా పంట కాలువ స్థల వివాదం నడుస్తోంది. ఈ వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి, ఆలయ అధికారులను ఇబ్బందుల్లో నెట్టాలనే కుట్రతోనే శ్రీనివాస్ ఈ అపచారానికి పాల్పడ్డాడు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ నింద సిబ్బందిపై పడుతుందని, తద్వారా వారిపై కేసులు వస్తాయని నిందితుడు భావించినట్లు విచారణలో తేలింది.
పోలీసుల దర్యాప్తులో నిందితుడికి ఎటువంటి రాజకీయ పార్టీలతో గానీ, ఇతర మతపరమైన సంస్థలతో గానీ సంబంధం లేదని తేలింది. నిందితుడు హిందూ మతానికి చెందినవాడేనని, కేవలం పంతం కోసమే దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసు రికార్డుల ప్రకారం నిందితుడు శ్రీనివాస్ పై గతంలోనే పలు నేర చరిత్రలు ఉన్నాయి. ఇతరులతో గొడవ పడటం, ఇబ్బందులకు గురిచేయడం ఇతనికి అలవాటుగా మారిందని అధికారులు వెల్లడించారు.
భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన ఈ ఘటనపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిపై BNS సెక్షన్ 298 (మతపరమైన విశ్వాసాలను అవమానించడం), 324(4) (ప్రజా ప్రయోజనం ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం) వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసును పక్కా ఆధారాలతో ఛేదించిన అమలాపురం పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.









