నిర్మలా సీతారామన్ పేరిట నకిలీ పెట్టుబడి వీడియోలు: అప్రమత్తం చేసిన ఫ్యాక్ట్ చెక్ విభాగం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న పెట్టుబడి వీడియోలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIB) వెల్లడించింది. ఆర్థిక మంత్రి స్వయంగా కొన్ని పెట్టుబడి పథకాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియోలు ఏఐ (AI) సాంకేతికతతో సృష్టించినవని అధికారులు గుర్తించారు. ప్రజలను తప్పుదారి పట్టించి వారి సొమ్మును దోచుకోవడమే లక్ష్యంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్థిక మంత్రి కానీ ఇటువంటి ఎలాంటి ప్రైవేట్ పెట్టుబడి పథకాలను లేదా ఆదాయ మార్గాలను ప్రచారం చేయడం లేదని పీఐబీ స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ లేదా ఆర్‌బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

వినియోగదారులు ఇటువంటి వీడియోలతో పాటు వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని, ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఓటీపీ (OTP), లేదా బ్యాంకింగ్ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఇటువంటి ప్రముఖుల వీడియోలను అడ్డుపెట్టుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, ఏవైనా అనుమానాస్పద లింకులు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు