మార్షల్ ఆర్ట్స్ ‘టైగర్’ పవన్ కల్యాణ్: జపనీస్ యుద్ధకళలో అరుదైన గౌరవం.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ యుద్ధ కళల్లో (Martial Arts) అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘టకెడా షింగెన్ క్లాన్‌’ (Takeda Shingen Clan) లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన కొనసాగిస్తున్న నిరంతర సాధన, పరిశోధనలకు ఈ పురస్కారం దక్కింది.

ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’ (Kenjutsu) లో పవన్ నైపుణ్యానికి గుర్తింపుగా జపాన్‌కు చెందిన ‘సోగో బుడో కన్‌రి కై’ సంస్థ ఆయనకు 5th డాన్ (Fifth Dan) పురస్కారాన్ని అందించింది. జపాన్ వెలుపల ఈ క్లాన్‌లో ప్రవేశం లభించడం అత్యంత అరుదైన విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో పవన్ కల్యాణ్ ‘కెండో’ (Kendo) లో కూడా ఉన్నత స్థాయి శిక్షణ పొంది, సాంకేతిక మరియు తాత్విక లోతులను ఆకళింపు చేసుకున్నారు.

పవన్ కల్యాణ్ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచే మార్షల్ ఆర్ట్స్‌ను తన చిత్రాల్లో భాగం చేస్తూ వచ్చారు. తమ్ముడు, ఖుషి, జానీ వంటి చిత్రాల నుంచి రాబోయే ఓజీ (OG) వరకు ఆయన ప్రదర్శించిన విన్యాసాల వెనుక సంవత్సరాల తరబడి చేసిన కఠిన శిక్షణ ఉంది. ఈ అంతర్జాతీయ గుర్తింపు కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, యుద్ధ కళల పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం. భవిష్యత్తులో పిఠాపురంలో భారతదేశంలోనే అత్యుత్తమ మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు