కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద బుధవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఒకప్పుడు కబ్జాలు, మురికి మరియు దుర్గంధంతో నిండిన ఈ చెరువు ఇప్పుడు ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా మారి పతంగుల పండుగకు వేదికైంది. స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు ఈ కైట్ ఫెస్టివల్‌కు హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, స్వయంగా గాలిపటం ఎగురవేసి వేడుకలను ఉత్సాహంగా ప్రారంభించారు. చిన్నారులు, యువతతో కలిసి ఆయన పండగ జరుపుకోవడం స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
కబ్జాల నుంచి 30 ఎకరాల విస్తీర్ణానికి.. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, గతంలో కేవలం 16 ఎకరాలకు కుంచించుకుపోయిన నల్లచెరువును కబ్జాల నుంచి విడిపించి, పూడికతీత పనుల ద్వారా 30 ఎకరాలకు విస్తరించామని వెల్లడించారు. 2024 సెప్టెంబరులో పనులు ప్రారంభించినప్పుడు అనేక నిరసనలు ఎదురైనప్పటికీ, నేడు ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే తమ విజయమని ఆయన పేర్కొన్నారు. చెరువు లోతు పెంచడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు వరద ముంపు సమస్య తప్పుతుందని, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని వివరించారు.
మరో 14 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక నగరంలో చెరువుల అభివృద్ధి కేవలం పైపై మెరుగులు కాదని, పూర్తిస్థాయి పునరుద్ధరణే లక్ష్యమని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని, ఫిబ్రవరి నాటికి మరో మూడు చెరువులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వీటికి అదనంగా మరో 14 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, త్వరలోనే అక్కడ షటిల్ కోర్టులు, యోగా కేంద్రాలు, సైకిల్ ట్రాక్‌లు వంటి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో 100 చెరువులను ఇలా అభివృద్ధి చేస్తే వరదలను శాశ్వతంగా నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.








