సిరిసిల్ల క్లస్టర్‌పై కేంద్రం వివక్ష: కేంద్ర మంత్రికి కేటీఆర్ ఘాటు లేఖ!

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర వస్త్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. పదేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం తెలంగాణపై చూపుతున్న వివక్షకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. కేంద్ర బృందాలే సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని గతంలోనే ధృవీకరించినప్పటికీ, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు.

తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ లాంటి సిరిసిల్లలో 30 వేలకు పైగా పవర్ లూమ్‌లు ఉన్నాయని, వేలాది కుటుంబాలు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. సామర్థ్యం తక్కువ ఉన్న ప్రాంతాలకు క్లస్టర్లు మంజూరు చేస్తూ, అన్ని వసతులు ఉన్న సిరిసిల్లను విస్మరించడం ప్రాంతీయ వివక్షేనని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ క్లస్టర్ కోసం అవసరమైన భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఇప్పటికే సిద్ధం చేసిందని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలు ఇవ్వడమే తప్ప, క్షేత్రస్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాంతాలకు మద్దతు ఇవ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. వస్త్ర పరిశ్రమ రంగంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ప్రకటించి, పదేళ్లుగా ఈ ప్రాంత నేతన్నలకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు