ఏపీలో డ్రోన్ విప్లవం: త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు!

రాష్ట్రంలో రవాణా మరియు ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏడాది (2026) నుంచే ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ టాక్సీలు, డ్రోన్ అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు డ్రోన్ అంబులెన్సులు కీలక పాత్ర పోషిస్తాయని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు డ్రోన్ టాక్సీలు తోడ్పడతాయని ఆయన వివరించారు. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

జ్యూరిచ్ పర్యటనలో ఉన్న సీఎం, ఎన్నారైలను (NRI) పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకోసం రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

విశాఖపట్నం నగరం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అగాథంలోకి వెళ్ళిన ఏపీని మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో తనకు లభించిన ఘన స్వాగతంపై హర్షం వ్యక్తం చేస్తూ, యూరప్ నుంచి నేరుగా ఏపీకి విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు