తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి ప్రవర్తన ఒక సైబర్ నేరగాడి తరహాలో ఉందని హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అమలు కాని హామీలను ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా తమపై ఇటువంటి నోటీసులు ప్రయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రజలు మంత్రులను నిలదీస్తున్నారని, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. “కేసీఆర్ హయాంలో ఖజానా నుంచి ప్రజల కోసం డబ్బులు ఖర్చు చేస్తే, రేవంత్ మాత్రం ప్రజల ఖాతాల నుంచే డబ్బులు గుంజుకుంటున్నారు” అని విమర్శించారు. మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని, ప్రజల ముందుకు వెళ్లడానికి కాంగ్రెస్ నేతలు జంకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
సిట్ నోటీసులకు తాము భయపడబోమని, ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజల తరపున పోరాటం ఆపేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి సంబంధించిన కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. “మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మీ వెంటపడుతూనే ఉంటాం.. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ముఖ్యమంత్రికి హరీశ్ రావు గట్టి హెచ్చరిక జారీ చేశారు.









