పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. తనను దూరం పెడుతోందన్న కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలి ముక్కును బ్లేడుతో కోసేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిడుగురాళ్లలోని మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ అనే మహిళ, భర్తతో విభేదాల కారణంగా విడిపోయి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో భార్యకు దూరంగా ఉంటున్న వెంకట్రావు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే, గత కొన్ని రోజులుగా మరియమ్మ తనను దూరం పెడుతుండటంతో వెంకట్రావు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దీనిపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఎలాగైనా ఆమెపై కక్ష తీర్చుకోవాలని భావించిన వెంకట్రావు, తన స్నేహితుడితో కలిసి మరియమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ మరోసారి ఆమెతో వాగ్వాదానికి దిగి, కోపంతో ఊగిపోతూ తన వెంట తెచ్చుకున్న పదునైన వస్తువుతో ఆమె ముక్కు కోసేసి అక్కడి నుంచి పారిపోయాడు.
బాధితురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు వెంకట్రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.









