ప్రేమ కోసం కన్నవారిపై కిరాతకం: మత్తు ఇంజెక్షన్‌తో తల్లిదండ్రులను చంపిన నర్సు!

వికారాబాద్ జిల్లా బంత్వారం మండలంలోని యాచారం గ్రామంలో మానవ సంబంధాలను మంటగలిపే దారుణం జరిగింది. తన ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారనే కక్షతో, నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను ఓ కూతురు అత్యంత దారుణంగా హత్య చేసింది. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె, తన వృత్తిని ఆయుధంగా మార్చుకుని తల్లిదండ్రుల ప్రాణాలను హరించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

నమ్మించి మృత్యువును ఎక్కించింది

సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించడంతో వారిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న తల్లి లక్ష్మి, తండ్రి దశరథంలకు “నొప్పులు తగ్గుతాయి” అని నమ్మబలికి కేటామైన్ వంటి శక్తివంతమైన హై-డోస్ మత్తుమందును ఇంజెక్షన్ రూపంలో ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే నాటకం

తల్లిదండ్రులను చంపిన తర్వాత సురేఖ ఏమీ తెలియనట్లుగా తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి, వారు పలకడం లేదని ఏడుస్తూ నాటకమాడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడం, మృతదేహాలపై అనుమానాస్పద గుర్తులు ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. పోలీసుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పిన సురేఖ, చివరికి తానే హత్య చేసినట్లు అంగీకరించింది.

కఠిన శిక్ష పడాలని గ్రామస్థుల డిమాండ్

ప్రస్తుతం పోలీసులు సురేఖను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘాతుకంలో ఆమెకు ప్రియుడు లేదా మరెవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కంటికి రెప్పలా కాపాడి, ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులను పెళ్లి కోసం ఇలా ప్రాణాలు తీయడంపై యాచారం గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కిరాతక కూతురికి ఉరిశిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు