ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో, అతను తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది.
పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం.. రవిపై సుమారు నాలుగు నుండి ఐదు వరకు సీరియస్ కేసులు నమోదయ్యాయి. కేవలం పైరసీయే కాకుండా, కాపీరైట్ ఉల్లంఘన, ఐటీ చట్టం మరియు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పైరసీ ద్వారా చిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం చేకూర్చడమే కాకుండా, అక్రమ సంపాదనను విదేశాలకు మళ్లించాడనేది ప్రధాన ఆరోపణ.
రవికి బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతనికి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ (Saint Kitts and Nevis) వంటి విదేశీ పౌరసత్వం ఉందని, ఒకవేళ బెయిల్ ఇస్తే అతను దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని నాంపల్లి కోర్టులో పోలీసులు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన కింది కోర్టు గతంలో అతని బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పుడు హైకోర్టులో పోలీసులు దాఖలు చేయబోయే కౌంటర్ మరియు కోర్టు నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.









