మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శనివారం రాత్రి అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాడేపల్లిలో పోలీసులు తనతో పాటు సుమారు 60 మందిని అక్రమంగా నిర్బంధించారని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, పోలీసుల తీరు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆమె ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
అంబటి రాంబాబుపై కేసు నమోదు మరియు అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు తమకు కనీస రక్షణ కల్పించడం లేదని, పైగా అక్రమంగా గృహ నిర్బంధంలో ఉంచారని విజయలక్ష్మి పేర్కొన్నారు. తనకు మరియు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని భావిస్తున్నట్లు తెలుపుతూ, తక్షణమే 24 గంటల పాటు పోలీసు భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు.
ప్రస్తుతం అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంబటిపై కేసు నమోదు కావడంతో వైసీపీ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకుంటున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









