హైదరాబాద్‌లో సరికొత్త వింత: నాంపల్లిలో దేశంలోనే తొలి ‘రోబోటిక్ పార్కింగ్’ కేంద్రం ప్రారంభం!

హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో ట్రాఫిక్ మరియు పార్కింగ్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ మల్టీ లెవల్ రోబోటిక్ పార్కింగ్ (MLRP) కేంద్రాన్ని శనివారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సుమారు ₹102 కోట్ల వ్యయంతో, 15 అంతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ అత్యాధునిక కాంక్లేవ్ ఇప్పుడు నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఈ పార్కింగ్ కేంద్రం పూర్తిగా జర్మనీకి చెందిన అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. ఇక్కడ వాహనదారులు తమ కారును పార్క్ చేయడానికి శ్రమించాల్సిన అవసరం లేదు. డ్రైవర్ తన కారును లోపల ఉన్న ప్లాట్‌ఫారమ్ (టేబుల్)పై ఆపి దిగిపోవాలి. ఒక కార్డును స్వైప్ చేయగానే, రోబోటిక్ లిఫ్ట్ సిస్టమ్ కారును ఆటోమేటిక్‌గా పైకి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న స్లాట్‌లో భద్రపరుస్తుంది. మళ్లీ మనం వెళ్లేటప్పుడు కార్డు వాడితే, కేవలం నిమిషాల వ్యవధిలోనే కారు మన ముందుకు వస్తుంది.

ఈ 15 అంతస్తుల భవనం కేవలం పార్కింగ్‌కే పరిమితం కాకుండా, ఒక మినీ షాపింగ్ మాల్‌లా రూపుదిద్దుకుంది. ఇందులో 10 అంతస్తులు కేవలం పార్కింగ్‌కే కేటాయించగా, అందులో 200 కార్లు, 200 బైకులు పార్క్ చేయవచ్చు. మిగిలిన 5 అంతస్తుల్లో షాపింగ్ మాల్స్ మరియు రెండు సినిమా థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. అన్నింటికంటే పై అంతస్తులో హైదరాబాద్ నగర అందాలను వీక్షించడానికి ప్రత్యేకంగా వ్యూయింగ్ డెక్ ఏర్పాటు చేశారు. నాంపల్లి మెట్రో మరియు రైల్వే స్టేషన్ రద్దీని తగ్గించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు