గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 27న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత నిర్ణయించింది. అయితే, తాజాగా ఈ విడుదల తేదీని ఏప్రిల్ 30కి వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం రామ్ చరణ్ బాబాయ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదలవుతుండటమే. బాక్సాఫీస్ వద్ద బాబాయ్-అబ్బాయిల మధ్య అనవసర పోటీని నివారించేందుకు ‘పెద్ది’ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విడుదల తేదీ మార్పు చిత్రానికి వ్యాపారపరంగా కూడా కలిసి వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 30 (గురువారం) సినిమా విడుదల కానుండగా, మరుసటి రోజు మే 1వ తేదీన ‘మే డే’ సందర్భంగా జాతీయ సెలవు దినం ఉండటం దీనికి పెద్ద ప్లస్ కానుంది. ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాలతో కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల సుదీర్ఘ వీకెండ్ లభిస్తుంది. సమ్మర్ హాలిడేస్ సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్రామీణ క్రీడా నేపథ్యంతో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ లుక్‌లో, గుబురు గడ్డంతో ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది.









