గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన వచ్చిన తర్వాతే గజ్వేల్‌లో ఆగిపోయిన అభివృద్ధి పనులు పూర్తవుతాయని అన్నారు. గతంలో పందుల నిలయంగా ఉన్న గజ్వేల్ ఆసుపత్రిని కేసీఆర్ హయాంలో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. తమను బాగా చూసుకునే వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఆశపెట్టిన కాంగ్రెస్, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదని.. కానీ బంగారం ధరలు మాత్రం చుక్కలంటుతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలను తిట్టడం తప్ప పాలనపై అవగాహన లేదని హరీశ్ రావు ఆరోపించారు.
గడచిన రెండున్నరేళ్లలో గజ్వేల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నిధులను ఈ నెల 11వ తేదీ లోపు విడుదల చేయకపోతే రైతులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే కేసీఆర్‌తో అభివృద్ధి విషయంలో పోటీ పడాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత పెరిగిందని, త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.









