తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాల నుంచి వారిని కాపాడేందుకు బీజేపీ నేతలు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని, అందుకే కాళేశ్వరం అవినీతిపై నివేదిక ఇచ్చి ఆరు నెలలు దాటినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలను కాపాడేందుకు బీజేపీ ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతోందని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తమ అక్రమ సంపాదనను బీజేపీ నేతలకు చేరవేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా విచారణ సంస్థలు మౌనంగా ఉంటున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతి పైసాను కక్కిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కనీసం సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు కూడా హాజరు కాలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పేదల దేవుళ్ల ముందు తలవంచడానికి వారు ఇష్టపడటం లేదని, గతంలో భద్రాచలం విషయంలోనూ ఇదే ధోరణి ప్రదర్శించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా, తమ ప్రభుత్వం ఆ అప్పులు తీర్చుకుంటూనే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









