మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రేయసి నయనిక రెడ్డితో కలిసి ఆయన వచ్చే నెలలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో దుబాయ్‌లో అట్టహాసంగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అక్కడి సముద్రతీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాచ్ (Yacht) పార్టీలో అల్లు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు పాల్గొని సందడి చేశారు.
ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ తన సోదరుడు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ పార్టీలో చిల్ అవుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్‌తో పాటు ఆయన అన్నయ్య అల్లు బాబీ (వెంకటేష్) కుటుంబం, నటి సోఫీ చౌదరి మరియు ఇతర స్నేహితులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్ నైట్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఈ పార్టీ ఫోటోలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అల్లు శిరీష్-నయనికల వివాహం 2026, మార్చి 6న జరగనుంది. గతేడాది వీరిద్దరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లి వేడుకలను మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను నయనిక స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, నెటిజన్లు ఈ జంటకు ముందస్తుగా పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.









