అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని దళిత సామాజిక వర్గ నాయకులు మరియు ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు మనమందరం సమాన హక్కులతో జీవిస్తున్నామని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యావంతులు కావాలని, తద్వారా సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, దేశమంతా గర్వించదగ్గ గొప్ప నాయకుడని అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. యాడికిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ విగ్రహం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.









