ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారు.. రేవంత్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పండి: హరీష్ రావు ధ్వజం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి, గత 24 నెలలుగా ఒక్కో మహిళకు 60,000 రూపాయల బాకీ పడ్డారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచి ఇస్తుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం ఇక్కడ ఇవ్వడానికి చేతులు రావడం లేదని విమర్శించారు.

రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ఐదు పంటలకు గాను కేవలం రెండు పంటలకే రైతుబంధు ఇచ్చి, మిగిలిన మూడు పంటలకు ఎగ్గొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు. సాటిలైట్ సర్వేలు, కొత్త నిబంధనల పేరుతో రైతులను గోస పెడుతున్నారని, సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. దేవుడి మీద ఒట్టు వేసి రైతులను మోసం చేసిన పాపం కాంగ్రెస్‌కు తగులుతుందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి ‘గూబ గుయ్యి’ మనేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

జిన్నారం వంటి ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చడం కేవలం ప్రజలపై పన్నుల భారం మోపడానికేనని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో పెన్షన్లు పెంచిన తీరును గుర్తు చేస్తూ, ఇప్పుడు అవ్వతాతలు పెన్షన్ అడిగితే లాగుల్లో తొండలు వేస్తామనడం, మహిళలు తులం బంగారం అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడుతామనడం రేవంత్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. మైనార్టీలకు షాదీ ముబారక్ వంటి పథకాలను అటకెక్కించారని, ఈ అహంకార పూరిత పాలనకు ముగింపు పలకాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు