తెలంగాణ మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్: హస్తం పార్టీ క్లీన్ స్వీప్? కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ (People’s Pulse) సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తం 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 5 స్థానాలను (మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, నల్గొండ, కొత్తగూడెం) కైవసం చేసుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. మిగిలిన 2 కార్పొరేషన్లు (కరీంనగర్, నిజామాబాద్) బీజేపీ పరం అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే, గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒక్క కార్పొరేషన్‌లో కూడా జెండా ఎగురవేయలేకపోయే ప్రమాదం ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.

పురపాలికల (Municipalities) పరంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని సర్వే చెబుతోంది. మొత్తం 123 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68 నుంచి 76 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 29-36 స్థానాలతో రెండో స్థానంలో నిలవనుండగా, బీజేపీ కేవలం 3-5 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా. ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ 36%, బీఆర్ఎస్ 29.7%, మరియు బీజేపీ 19.3% సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉందని సమాచారం.

సామాజిక వర్గాల వారీగా విశ్లేషిస్తే, ఎస్సీలు (41.2%), ముస్లింలు (44.7%), మరియు బీసీ ఓటర్లు (33.6%) ప్రధానంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. కాగా, ఎస్టీ ఓటర్లు మాత్రం 36.9% బీఆర్ఎస్ వైపు నిలిచినట్లు తెలుస్తోంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ద్వారా తేలనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు