తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన గర్జన!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ రాజకీయంగా పెను సంచలనం రేపారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు పోటీ ఎవరూ లేరు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తుది దశకు చేరుకుందని, దర్యాప్తు ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష సాధింపులు లేవని సీఎం స్పష్టం చేశారు. ఒకవేళ కేసీఆర్‌ను జైలుకు పంపాల్సి వస్తే, అది కేవలం నిబంధనలు మరియు చట్టం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరియు ఫార్ములా ఈ-రేసు అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ అధికారులు.. కేసీఆర్, కేటీఆర్‌ల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన నిలదీశారు.

కేసీఆర్, హరీష్ రావుల కనుసన్నల్లో ప్రభుత్వం నడవదని, వాస్తవాలను త్వరలోనే సభ ముందు ఉంచుతానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సింగరేణి బకాయిలు కేసీఆర్ హయాం నుంచే ఉన్నాయని, పదేళ్లుగా కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక మానసిక రోగమని, తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, ఆ తప్పులను తమపై నెట్టేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు సాగవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు