సుహాస్, శివానీ నగరం ప్రధాన పాత్రల్లో నటించిన ‘హే భగవాన్’ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు నరేష్ వేదికపై సందడి చేస్తూ, తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వాలంటైన్స్ వీక్‌లో భాగంగా ‘హగ్ డే’ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన చేసిన అల్లరి అందరినీ నవ్వించింది.
వేదికపై ఉన్న పురుషులందరికీ హగ్ ఇచ్చిన నరేష్.. హీరోయిన్ శివానీ నగరం, యాంకర్ స్రవంతి దగ్గరకు వచ్చి ఆగిపోయారు. “మిమ్మల్ని కూడా హగ్ చేసుకుందామనే వచ్చాను, కానీ మీరిద్దరూ పద్ధతిగా చీరలు కట్టుకుని వచ్చారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ప్రభావమో ఏమో గానీ, ఇప్పుడు చాలామంది స్టేజీలపై చీరల్లోనే కనిపిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లని హగ్ చేసుకోకూడదు కాబట్టి, మీరిద్దరే ఒకరినొకరు హగ్ చేసుకోండి అంటూ ఆయన చమత్కరించారు.
గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘హే భగవాన్’ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో నరేష్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నరేష్ మరియు స్రవంతి కీలక పాత్రలు పోషించారు. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయని, యువతకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.









