శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక శోభ: గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. అరుణాచలం తరహాలో అభివృద్ధి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం వెలగపూడి సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో శ్రీకాళహస్తి నూతన గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించారు. సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 22 కిలోమీటర్ల మార్గం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడులోని అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణ చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉందని, త్వరలోనే క్షేత్రాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని వెల్లడించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందే ఈ రోడ్డు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

దేవాలయాల పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వంటి పవిత్ర క్షేత్రాల్లో కూడా అపచారాలు జరిగాయని, నాటి పాలక మండళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇవన్నీ జరిగాయని మండిపడ్డారు. దేవాలయాలు మన నాగరికతకు చిహ్నాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆలయ పాలక మండళ్లు రాజకీయాలకు అతీతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు రూ. 3.70 కోట్లు, కోటప్పకొండకు రూ. 4 కోట్లు, వాడపల్లి ఆలయానికి రూ. 6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం రూ. 40 కోట్లతో 22 ప్రధాన దేవాలయాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గానికి ఇరువైపులా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా గిరి ప్రదక్షణలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నూతన ట్రస్ట్ బోర్డుకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు