బాలీవుడ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ కలకలం: రణవీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు ప్రాణహాని.. ఆడియో సందేశంతో బెదిరింపులు!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మరియు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిలకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. తనను తాను బిష్ణోయ్ అనుచరుడిగా చెప్పుకుంటున్న హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి, వాట్సాప్ ద్వారా ఒక ఆడియో సందేశాన్ని పంపాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రణవీర్ సింగ్‌తో పాటు అతడి వద్ద పనిచేసే సిబ్బందిని కూడా హతమారుస్తామని ఆ సందేశంలో హెచ్చరించాడు. ఈ వార్తతో ఒక్కసారిగా ముంబై సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

రణవీర్ సింగ్‌ను ఉద్దేశించి ఆ ఆడియోలో దుండగుడు అత్యంత ఘాటుగా మాట్లాడాడు. “నీ భవిష్యత్తులో ఏడు తరాలు గుర్తుండిపోయేలా నిన్ను హత్య చేస్తాం. నువ్వు మా బెదిరింపులను లెక్క చేయకుండా ఇతరులను పోలీసులకు ఫిర్యాదు చేయమని ప్రోత్సహిస్తున్నావు. నీ వద్ద పనిచేసే వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు.. వారి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి అనే పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి చంపుతుంటే అప్పుడు నీకు అసలు విషయం అర్థమవుతుంది. హత్యలు మొదలయ్యేలోపే మేలుకో” అంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇవే హెచ్చరికలు వర్తిస్తాయని దుండగుడు స్పష్టం చేశాడు. గతంలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలకు బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రణవీర్ సింగ్, రోహిత్ శెట్టిలను టార్గెట్ చేయడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెదిరింపు మెసేజ్ వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రముఖుల భద్రతను పర్యవేక్షిస్తూ, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు