తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ పెంచింది. ఈ ఉప ఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు లంకల దీపక్ రెడ్డిని మరోసారి బరిలోకి దింపింది. గతంలో తెలుగుదేశం పార్టీలో చాలాకాలం పనిచేసిన ఆయన బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి పోటీచేసిన ఆయన 25,866 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఆయనకు పేరుంది.
దీపక్ రెడ్డి బలాలు చూస్తే.. ఆయనకు జూబ్లీహిల్స్ రాజకీయాలపై మంచి పట్టు ఉంది. చాలాకాలంగా ఈ ప్రాంత ప్రజల్లో ఉండటం, గతంలో పోటీచేయడం వల్ల నియోజకవర్గంలోని బలాబలాలు ఆయనకు తెలుసు. చదువుకున్నవారు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీజేపీకి ప్రజాదరణ ఎక్కువ. అంతేకాక, గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం, ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా ఉండటం కూడా ఆయనకు కలిసివచ్చే అంశం. దీపక్ రెడ్డి వివాదారహితుడిగా పేరుండటంతో పార్టీ నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉంది.
అయితే, ఆయనకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉందనే రాజకీయ వాతావరణం ఏర్పడటం బీజేపీని బలహీనపరుస్తోంది. ఉప ఎన్నికలో సీటు ఆశించిన ఇతర అభ్యర్థులు దీపక్ రెడ్డికి ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకం. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అధికార, ధనబలం తోడవగా, దీపక్ రెడ్డికి అలాంటి అడ్వాంటేజ్‌లు లేకపోవడం ఒక బలహీనత. మొత్తంమీద, దీపక్ రెడ్డి విజయం బీజేపీ నాయకత్వం, క్యాడర్ కృషిపై ఆధారపడి ఉంటుంది.









