రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ‘VD 14’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాపై తాజాగా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 19వ శతాబ్దపు యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలిపారు. ఈ సినిమాలో విజయ్ నటన అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులు ఆయన నట విశ్వరూపం చూస్తారని రాహుల్ సంకృత్యన్ పేర్కొన్నారు.
‘VD 14’ సినిమా బ్రిటీష్ ఇండియా కాలం నేపథ్యంలో, 1854 నుంచి 1878 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్, ఆయన గెటప్ చాలా కొత్తగా ఉంటాయని సమాచారం. ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ, ‘VD 14’ మూవీలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని తెలిపారు. ఈ మాటలు సినిమా స్ట్రాంగ్ కంటెంట్ మరియు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో తెరకెక్కుతోందని అర్థమవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జంట మూడోసారి కలిసి నటిస్తుండటం విశేషం. వ్యక్తిగత జీవితంలో నిశ్చితార్థం వార్తల నేపథ్యంలో, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకి ‘VD 14’ సినిమా మరింత స్పెషల్ మూవీగా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ రానున్నాయి.









