ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సహా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగులు తమ కీలక డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు, వీటిలో ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే 30% మధ్యంతర భృతి (I.R) ని ప్రకటించాలని కోరారు.
ఉద్యోగ సంఘాలు సమర్పించిన డిమాండ్ల జాబితాలో పలు ఆర్థిక అంశాలు ఉన్నాయి. 4 పెండింగ్ డీ.ఏలు (కరువు భత్యం) వెంటనే ప్రకటించాలని, డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ సహా ఇతర బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని కోరారు. ముఖ్యంగా సీపీఎస్ (Contributory Pension Scheme) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2004 సెప్టెంబరు 01 తేదీకి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈహెచ్ఎస్ (EHS)/మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని, నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులను ఉపయోగంలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు.
మంత్రుల కమిటీలో ఉన్న పయ్యావుల కేశవ్, ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ప్రకటన చేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలు కోరిన నాలుగు డీఏల బకాయిలలో, దీపావళి కానుకగా ప్రభుత్వం రెండు డీఏలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాతే, తమ పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి, కారుణ్య నియామకాలు చేపట్టాలని, బోధన తప్ప ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలని, 1998, 2008 ఎం.టి.ఎస్. టీచర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్లు చేశారు.









