దీపావళి రోజున మోదీకి ట్రంప్ ఫోన్: రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించాలని చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో దీపావళి సందర్భంగా ఫోన్‌లో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్న ట్రంప్, మంగళవారం మోదీతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ చర్చలో ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. భారత్ చమురు దిగుమతులు తగ్గిస్తే, అది యుక్రెయిన్‌లో శాంతికి దారి తీస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా ఆయిల్ దిగుమతులను తగ్గించడంపై తనకు మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు.

ట్రంప్ మాట్లాడుతూ, “మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన (మోదీ) రష్యా నుంచి చమురును భారీగా కొనరు. ఆయనకూ యుద్ధం ముగియాలని ఉంది. భారత్ చమురును భారీ స్థాయిలో కొనడం లేదు. చాలా తగ్గించింది, ఇంకా తగ్గిస్తున్నారు” అని పేర్కొన్నారు. అయితే, భారత్ ప్రభుత్వం మాత్రం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేస్తూ, భారత్‌కు తన ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసింది. చమురు అమ్ముతూ రష్యా సంపాదిస్తున్న డబ్బు యుద్ధానికి ప్రధాన కారణంగా ఉందని, భారత్ చమురు కొనడం ఆపితే రష్యా యుద్ధ యంత్రాంగం దెబ్బతింటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

తనకు ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీ ట్రంప్‌కు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ధన్యవాదాలు చెప్పారు. “మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు… ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని, ప్రపంచానికి ఇలాగే వెలుగులు అందించాలని ఈ దీపకాంతుల దీపావళి రోజున కోరుకుంటున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. ఈ చర్చలో వాణిజ్యం, ప్రాంతీయ శాంతి వంటి అంశాలపైనా చర్చించినట్లు ట్రంప్ వైట్‌హౌస్ వేడుకలో వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు