బిహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ప్రకటించిన మహాఘట్‌బంధన్: ఎన్డీఏకు గెహ్లోట్ సవాల్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ పేరును మహాఘట్‌బంధన్ కూటమి గురువారం అధికారికంగా ప్రకటించింది. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముకేశ్ సహానీని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంది. పాట్నాలో నిర్వహించిన మహాఘట్‌బంధన్ మిత్రపక్షాల సంయుక్త మీడియా సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ప్రతిపక్ష కూటమి నాయకత్వంపై కొన్ని వారాలుగా కొనసాగిన ఊహాగానాలకు ముగింపు లభించింది. తమ కూటమి సంపూర్ణ ఐక్యతతో పోటీ చేస్తుందని గెహ్లోట్ తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ ఎన్డీఏ కూటమికి సవాల్ విసిరారు. “ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు? అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఇది మా డిమాండ్” అని గెహ్లోట్ అన్నారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికలు ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో జరిగాయని అనుకున్నప్పటికీ, తరువాత మరొకరిని ముఖ్యమంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఎన్డీఏ పాలనలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతింటున్నాయని, దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గెహ్లోట్ అన్నారు.

సీఎం అభ్యర్థిగా ప్రకటించబడిన తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. మహాఘట్‌బంధన్ లక్ష్యం కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదని, బిహార్‌ను మార్చడం కూడా అని స్పష్టం చేశారు. నాపై విశ్వాసం ఉంచిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వారి అంచనాలకు తగ్గట్టు పనిచేస్తానని అన్నారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తామందరం కలిసి గద్దె దించుతామని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి, అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తనపై నమ్మకం ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు