తిరుపతి స్వర్ణముఖి నదిలో విషాదం: ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు

తిరుపతి జిల్లా రూరల్ మండలం వేదాంతపురం సమీపంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన నలుగురు బాలురు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం ఏడుగురు బాలురు నదిలోకి వెళ్లగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. నదిలోకి వెళ్లిన మరో ముగ్గురు చిన్నారులను స్థానిక ప్రజలు సకాలంలో కాపాడటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.

విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా డ్రోన్ల సహాయంతో ఇప్పటికే ఇద్దరు బాలుర మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు హోంమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉందని హోంమంత్రి అనిత ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు