“తమిళగ వెట్రి కళగం” (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ గత నెల 27వ తేదీన కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషాద ఘటన నేపథ్యంలో నిలిపివేసిన తన రాష్ట్ర పర్యటనను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారం నుండి ఈ పర్యటనను తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో విజయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ మరియు పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపినట్లు టీవీకే వర్గాలు తెలిపాయి.
భద్రతపై కొత్త మార్గదర్శకాలు
ప్రజల రక్షణపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని విజయ్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కరూర్ ఘటన దృష్ట్యా, విజయ్ రోడ్‌షోలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపై కేవలం విశాలమైన మైదానాల్లో మాత్రమే సభలు నిర్వహించాలని టీవీకే పార్టీ నిర్ణయించింది.
ప్రయాణంలో మార్పులు
ప్రజల రద్దీ, వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన ప్రచారాన్ని కొనసాగించేందుకు విజయ్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. పర్యటన సందర్భంగా చెన్నై నుంచి సభా ప్రాంగణాలకు హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం కోసం బెంగళూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన ఆధికారిక షెడ్యూల్ ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.









