‘మొంథా’ తుఫాను ప్రభావం: 105 రైళ్లు రద్దు, హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా, ఈ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో కోస్తా ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది.

రెండు రోజుల్లో 105 రైళ్లు రద్దు

తుఫాను ప్రభావం మరియు భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 70 రైళ్లు, బుధవారం 35 రైళ్లు… మొత్తం రెండు రోజుల్లో కలిపి 105 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే మరో 17 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, గుంటూరు, కాకినాడ వంటి ప్రధాన నగరాల నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ప్రయాణికుల కోసం హెల్ప్ డెస్కులు

రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకునేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి సమీక్షలో సూచించారని విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. వర్షం కారణంగా బ్రిడ్జీలు దెబ్బతినకుండా ట్రాక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పెట్రోల్ మెన్ వ్యవస్థను ముమ్మరం చేశారు. ప్రయాణికులకు ఆహార పానీయాల ఇబ్బందులు తలెత్తకుండా ఐఆర్‌టీసీని అప్రమత్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల టికెట్ల క్యాన్సిలైజేషన్ కొరకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు