నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు: లండన్‌కు సీఎం చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం రాత్రి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రాజధాని లండన్‌కు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 4న లండన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ నిర్వహించే కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకోనున్నారు. ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డుకు ఎంపికయ్యారు.

నారా భువనేశ్వరి అందుకోనున్న మరో ముఖ్య పురస్కారం: ‘ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లభించిన ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో ఈ అవార్డును స్వీకరించనున్నారు. గతంలో ఈ ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, పారిశ్రామికవేత్తలు గోపీచంద్ హిందూజా, రాజశ్రీ బిర్లా వంటి దిగ్గజ వ్యక్తులు అందుకున్నారు. ఇప్పుడు ఆ గౌరవం నారా భువనేశ్వరికి దక్కడం విశేషం.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యటనను కేవలం వ్యక్తిగత అవార్డుల ప్రదానోత్సవానికి పరిమితం చేయకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోనున్నారు. ఆయన ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు. సీఎం చంద్రబాబు దంపతులు తమ పర్యటనను ముగించుకుని నవంబర్ 6న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు