బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు: నిందితుడి గుర్తింపు!

ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఓ వ్యక్తి ఫోన్‌లో ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివమ్ ద్వివేది గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్‌ తాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 302 (హత్య) సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై రవి కిషన్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. “నా తల్లిని అసభ్య పదజాలంతో దూషించారు. మన ఆరాధ్య దైవం శ్రీరాముడి గురించి కూడా అవమానకరంగా మాట్లాడారు. ఇది కేవలం నాపై జరిగిన దాడి కాదు, మన ధర్మం, సంస్కృతిపై జరిగిన దాడి. అయినా నేను భయపడను. జాతీయవాదం, ధర్మం వైపే నిలబడతాను” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎంపీ కుటుంబసభ్యులను, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుడిని గుర్తించారు. నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఎంపీ రవి కిషన్‌కు భద్రత పెంచాలని ఆయన సిబ్బంది కోరారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన రవి కిషన్.. “న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు