శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఆలయం లోపలకి ప్రవేశించే గేట్ల వద్ద భారీగా భక్తులు గుమిగూడారు. గేట్ తెరవగానే మెట్లపై గందరగోళం జరిగి, భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ తొక్కిసలాటలో కిందపడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీయడంతో మృతుల సంఖ్య పెరిగింది.
ఈ ఘోర ప్రమాదానికి గుడి యాజమాన్యం చేసిన చిన్న తప్పిదమే కారణమని తెలుస్తోంది. కార్తీక మాసంలో, అది కూడా ఏకాదశి రోజు ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిసినప్పటికీ, ఆలయ యాజమాన్యం కనీసం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంతేకాక, వారి నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. పోలీసుల భద్రత కొరవడడం, ఆలయానికి భారీ ఎత్తున భక్తులను అనుమతించడమే యాజమాన్యం చేసిన పెద్ద తప్పుగా విమర్శలు వస్తున్నాయి.
దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, పాలకుల నుంచి, ఆలయ యాజమాన్యాల నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే, ఇక్కడ ఆలయ యాజమాన్యం తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.









