బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని తలసాని ప్రకటించారు. అలాగే, బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపించినా తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
“రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాషను మార్చుకోవాలి. ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలి” అని తలసాని అన్నారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయాంలో రూ.44 వేల కోట్లు ఖర్చు పెడితే, కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా అని ప్రశ్నించిన తలసాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23 నెలల్లో హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలని నిలదీశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పథకాలు ఆగుతాయని ప్రజలను భయపెడుతున్నారని, సంక్షేమ పథకాలు ఆగితే పోరాటం ఎలా చేయాలో బీఆర్‌ఎస్‌కు తెలుసని ఆయన హెచ్చరించారు.









