దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు, నియంత్రణపై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు (CSలు) ఈ కేసు విచారణలో కోర్టు ముందు హాజరయ్యారు. వీరు రాష్ట్రాల తరఫున సమర్పించాల్సిన అఫిడవిట్లు ఆలస్యంగా దాఖలైనందుకు సుప్రీంకోర్టుకు క్షమాపణలు కోరారు. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు.
సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తాము ఇప్పటికే అక్టోబర్ 29న అఫిడవిట్ సమర్పించామని తెలిపారు. రాష్ట్రంలో వీధికుక్కల నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై వివరాలు అందజేశామని చెప్పారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూడా తమ తమ ప్రభుత్వాలు చేపట్టిన చర్యల గురించి కోర్టుకు వివరించారు.
రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వీధి కుక్కల సమస్య పరిష్కారం కోసం ఒక సమగ్ర ఛార్ట్ రూపొందించాలని సుప్రీంకోర్టు అమికస్ క్యూరీకి సూచించింది. కాగా, ఈ కేసులో కుక్కకాటు బాధితులను కూడా ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ సమస్యపై తదుపరి విచారణ కొనసాగనుంది.









